కాకతీయ, సినిమా: థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘కొత్తలోక: చాప్టర్ 1 – చంద్ర’ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన తర్వాత, డిజిటల్ స్టేజ్‌పైకి రానుంది. అక్టోబర్ 31 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేట్రికల్ రన్ ముగిసిన కూడా ఈ సినిమాపై క్రేజ్ తగ్గకపోవడంతో, జియో హాట్‌స్టార్ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారతీయ పాన్-ఇండియా స్కేల్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పుడు బహుభాషా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగు, మలయాళం, తమిళంతో పాటుగా హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో కూడా కొత్తలోక చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇకపోతే ఈ మూవీకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు మరియు దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నస్లెన్ ప్రధాన పాత్రలు పోషించారు.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ ఉన్న హీరోయిన్‌గా “చంద్ర” పాత్రలో కనిపించింది. ఇది భారతీయ సినీరంగంలో మొదటి స్త్రీ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌గా నిలిచింది. ఫాంటసీ–యాక్షన్–కామెడీ మిశ్రమంలో రూపొందిన ఈ సినిమా, పాత పురాణాల ప్రపంచాన్ని ఆధునిక సన్నివేశాలతో మిళితం చేస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా ఆగస్టు 28న రిలీజ్ అయిన కొత్తలోక పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
కాగా, చాప్టర్ 1 ముగింపులోనే తదుపరి భాగానికి సంకేతాలు ఇచ్చారు. దీంతో ‘లోక చాప్టర్ 2’ పై ఆసక్తి పెరుగుతోంది. ఓటీటీలో కొత్తలోక సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చిందంటే.. తర్వాతి చాప్టర్ ప్రొడక్షన్ వేగం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. అక్టోబర్ 31 నుంచి జియో హాట్‌స్టార్‌లో చంద్ర కొత్త లోకాన్ని దర్శించడానికి సిద్ధమవ్వండి.


