మంత్రి వర్సెస్ ఐఏఎస్
వీఆర్‌ఎస్ కోసం రిజ్వీ అప్లికేషన్
ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ
ముఖ్యమంత్రి వద్దకు పంచాయితీ..
కేబినెట్ భేటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో హాజరు
రేవంత్‌రెడ్డితో ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ భేటీ
తెలంగాణలో కలకలం రేపుతోన్న ఐఏఎస్ వీఆర్ఎస్ అంశం
ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న బీఆర్ఎస్, బీజేపీ
వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రులు..ఉన్నతాధికారులు !
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆబ్కారీ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఉన్నతాధికారులకు అసలు పడటంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకోవడంతో మొత్తం వివాదం వెలుగులోకి వచ్చింది. మంత్రితో సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందని తేలింది. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదించొద్దని మంత్రి సీఎస్‌కు లేఖ రాయడంతో పంచాయితీ ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. అంతేగాక లేఖలో రిజ్వీపై మంత్రి జూపల్లి సంచలన ఆరోపణలు చేయడం కలకలంరేపింది. ఇప్పుడిదే అంశం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.
వీఆర్ఎస్‌కు దరఖాస్తు
అబ్కారీశాఖప్రధాన కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు బదిలీలు, పని చేయనీయడం లేదన్న అసంతప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అవేమీ వీఆర్‌ఎస్‌లో పేర్కొనకుండా కేవలం వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు వివరించారు. దీనికి అనుమతి ఇవ్వాలని కూడా సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.
సీఎస్‌కు జూపల్లి సంచలన లేఖ
రిజ్వీ వీఆర్‌ఎస్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌కు సంచలన లేఖ రాశారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. విధుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. దీంతోపాటు శాఖలో ఆయన చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ వేసే కాంట్రాక్‌ను 11 ఏళ్లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇది మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు.
సీఎంతో రిజ్వీ భేటీ..
పాతవారికే అవకాశాలు ఇస్తూ వస్తున్నారని లేఖలో తెలిపారు. ఇలా ప్రతి పని కూడా సీఎంవోకు, మంత్రిమండలికి సిఫార్స్ చేసి అధిక భారం మోపుతున్నారని వివరించారు. రిజ్వీ చేసిన జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరుగుతుందని లేఖలో వెల్లడించారు. ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు చేస్తూ మంత్రి జూపల్లి రాసిన లేఖ.. తెలంగాణ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో ఆయన రిజ్వీతో సమావేశం అవడం చర్చనీయమైంది. మంత్రి జూపల్లితో వివాదం నేపధ్యంలో వీరి భేటీ కీలకంగా మారింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాలెంటరీ రిటైర్‌మెంట్‌కు అప్లై చేసుకున్న రిజ్వీ.. కేబినేట్ సమావేశానికి ప్రిన్సిపాల్ సెక్రటరీ హోదాలో హాజరవడం హాట్ టాపిక్‌గా మారింది.


