ఇందిరమ్మ ఇళ్లకు ‘జీ+1’అనుమతులు
జనగామా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
చిన్న ప్లాట్ లబ్ధిదారుల్లో ఆనందం
కాకతీయ, జనగామ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చిన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద సడలింపు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్లాట్ పరిమితి తక్కువగా ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు జీ+1పద్ధతిలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం వెల్లడించారు. చిన్న ప్లాట్లలో 400 చదరపు అడుగుల నిర్మాణం సాధ్యంకాకపోవడంతో ప్రభుత్వం జీ+1 నిర్మాణానికి అనుమతిచ్చిందన్నారు. కనీసంగా 323 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలని, ప్రతి ఇంటిలో కిచెన్, బాత్‌రూమ్, టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నదని కలెక్టర్ వివరించారు. నిర్మాణ దశలవారీగా ఆర్థిక సహాయం విడుదల అవుతుందని తెలిపారు.
గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రూ.1 లక్ష, మొదటి అంతస్తు కాలమ్స్ నిర్మాణం తర్వాత మరో రూ.1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ.2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత రూ.1 లక్ష విడుదల చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు జనగాం జిల్లాలో 5793 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 4950 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. అందులో 2322 ఇళ్లు బెస్మెంట్ దశలో, 833 రూఫ్ లెవల్‌లో, 920 స్లాబ్ లెవల్‌లో, 25 ఇళ్లు పూర్తిగా నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. జనగాం పట్టణానికి 318 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 259 ఇళ్లు గ్రౌండింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇద్దరు లబ్ధిదారులు జనగాంలో, ముగ్గురు స్టేషన్ ఘనపూర్‌లో జీ+1 నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం రూ.77 కోట్లు 28 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. చిన్న ప్లాట్లలో జీ+1 నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది అని అన్నారు.


