- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ పునఃప్రారంభం
- విదేశీ పర్యటన ముగించుకొని నగరానికి చేరుకున్న స్పీకర్
- నేడు ప్రసాద్‌కుమార్ ఎదుట హాజరుకానున్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- ప్రకాశ్‌గౌడ్, యాదయ్య, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల విచారణ
- గతనెల 29నుంచి అనర్హత పిటిషన్లపై వాదనలు
- ఈనెల 30తో ముగియనున్న సుప్రీం కోర్టు గడువు
- విచారణ గడువు పొడిగించాలని కోరనున్న స్పీకర్ ?
- ఆసక్తిరేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు (అక్టోబర్ 24) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను పునఃప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది శాసనసభ్యులపై దాఖలైన ఈ పిటిషన్ల విచారణ ప్రక్రియలో స్పీకర్ వేగంపెంచారు. ఈనెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల వాదనలు, క్రాస్-ఎగ్జామినేషన్స్ పూర్తిచేశారు. రేపటి విచారణ మిగిలిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చడంలో కీలక మలుపుగా మారనుందని భావిస్తున్నారు. గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసిన స్పీకర్.. సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్పీకర్ విదేశీ టూర్‌కు వెళ్లే ముందు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై దాఖలైన పిటిషన్లపైన విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన టూర్ నేపథ్యంలో విచారణకు విరామం ఇచ్చారు. శుక్రవారం ఆ నలుగురు ఎమ్మెల్యేలమీద దాఖలైన పిటిషన్లపై వాదనలు స్పీకర్ సమక్షంలో జరగనున్నాయి.

31వరకు ఆంక్షలు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (రాజ్యాంగంలోని పదో షెడ్యూల్) కింద స్పీకర్ ఈ విచారణ చేపట్టనున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వయంగా విచారించే అవకాశం ఉంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ కార్యాలయం కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులు తప్ప మరెవరికీ అసెంబ్లీలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు (బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు), ప్రతివాదుల (ఫిరాయింపు ఎమ్మెల్యేలు) న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ నేపథ్యంలో ఈనెల 31వరకు అసెంబ్లీలో ఆంక్షలు విధించారు.
సుప్రీం ఆదేశాలతో..
బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన ఈ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరగడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. రేపటి షెడ్యూల్‌లో ఒక్కో ఎమ్మెల్యే కేసుపై విడివిడిగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఫిర్యాదుదారుల నుంచి న్యాయపరమైన వివరణలు, ఆధారాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చ
మొదటి దశలో నలుగురు ఎమ్మెల్యేల విచారణను విజయవంతంగా పూర్తి చేసిన స్పీకర్, రేపు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల వాదనలను విననున్నారు. ఈ కీలక ఘట్టం పూర్తి అయిన వెంటనే అనర్హత అంశంపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. స్పీకర్ తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ వారిపై అనర్హత వేటు పడితే, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. రేపటి విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.


