- కమిషనరేట్ స్థాయిలో పాల్గొన్న 117 మంది పోలీసులు
కాకతీయ, కరీంనగర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్‌లో బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కమిషనర్ గౌష్ ఆలం పర్యవేక్షణలో అస్త్ర కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు ఉన్న సిబ్బందికి పని ప్రదేశంలో లింగ వివక్ష, ఎస్సై స్థాయి అంతకుమించిన అధికారులకు పోలీసింగ్ బలోపేతం చేయడం అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మొత్తం 117 మంది పోలీసు సిబ్బంది తమ ప్రతిభను ప్రదర్శించారు. పోలీసింగ్‌లో అవగాహన, సృజనాత్మకత, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, విజేతలకు త్వరలో బహుమతులు అందజేస్తామని సీపీ తెలిపారు.


