- ఆర్టీఏ అధికారి నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు
- ఆన్లైన్ మోసాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ ప్రకటన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆన్లైన్ మోసలతో మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులమని నమ్మించి వరంగల్ ఆర్టీఏ అధికారి నుంచి ఏకంగా దుండగులు రూ.10.20 లక్షలు కాజేశారు. కొద్ది రోజుల క్రితం వరంగల్ ఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, అవినీతికి సంబంధించిన కొన్ని అంశాలను గుర్తించారు. ఈ తనిఖీల గురించి తెలుసుకున్న కేటుగాళ్లు ‘హలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నాను, మీరు లంచం బాగా తీసుకుంటున్నరట, మీ మీద మాకు ఫిర్యాదు వచ్చింది సెటిల్మెంట్ చేసుకోండి.
అర్జెంటుగా డబ్బులు ఆన్లైన్లో అకౌంట్ కు పంపించండి’ అంటూ ఓ అగంతకుడు వరంగల్ జిల్లాలో ఇద్దరు అధికారు లకు ఫోన్లు చేశాడు. అవినీతి కేసులో అరెస్టు కాకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బు చెల్లించాలని ఆర్టీఏ అధికారులను బెదిరించారు. ఆందోళన చెందిన ఆర్టీఏ అధికారులు దుండగులకు దశలవారీగా రూ.10. 20 లక్షలు చెల్లించారు. దుండగులతో ఫోన్‌లో మాట్లాడుతున్న క్రమంలో సదరు ఆర్టీఏ అధికారికి అనుమానం వచ్చింది. వెంటనే నేరుగా అసలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు చేసిన విచారణ ద్వారా తాము నకిలీ అధికారుల బారిన పడి మోసపోయామని సదరు ఆర్టీఏ అధికారులు జైపాల్ రెడ్డి గ్రహించారు. అనంతరం మోసగాళ్లపై మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ తరహా మోసాలు కేవలం ఆర్టీఏ అధికారులకే పరిమితం కాలేదు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతి కతను ఉపయోగించి ఉద్యోగులను,సామాన్య ప్రజలను మోసం చేస్తున్నా రు. ఉన్నతాధికారులు లేదా మంత్రుల వాయిస్‌ను ఏఐ ద్వారా సృష్టించి అత్యవసరంగా డబ్బులు అడుగుతున్నారు. బ్యాంక్ ఉద్యోగులు లేదా టెలికాం ఆపరేటర్లమని చెప్పి కేవైసీ అప్‌డేట్ పేరుతో ఓటీపీలు అడిగి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారు లు చెబుతున్నారు. ఏసీబీ, పోలీస్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఐటీ వంటి అధికారిక ఏజెన్సీల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లయితే ముందుగా ఆ అధికారి వివరాలు తీసుకొని ఆ శాఖ అధికారిక కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. అధికారిక విచారణలు లేదా ప్రభుత్వ లావాదేవీల కోసం అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బును లేదా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని అడగరని తెలిపారు.
వరంగల్ ఘటనపై స్పందించిన ఏసీబీ..
వరంగల్‌లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఆన్లైన్ మోసాలపై నమోదైన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ, బుధవారంప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ పేరిట వెలువడన ప్రకటనలో ఆన్లైన్ కాల్స్ పూర్తిగా మోసపూరిత కాల్స్ అని తెలియజేశారు. ఉద్యోగులు అలాంటి కాల్స్‌ను నమ్మకూడదని, అలాంటి నకిలీ కాల్ చేసేవారికి చెల్లింపులు చేయకూడదన్నారు. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి లేదా సామాన్యులకు అలాంటి కాల్స్ వస్తే, వారు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలన్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా తెలియజేయాలన్నారు. ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. వాట్సాప్ నెంబర్ 9440446106, ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ), X/ Twitter (@TelanganaACB).
సంప్రదించవచ్చని తెలియజేశారు. బాధితుడు లేదా ఫిర్యాదుదారుడి పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.


