కాకతీయ, సినిమాః నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేసిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ` థామా`. ఈ రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ థామా మూవీని నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ అయిన థామాకు ప్రేక్షకుల నుంచి పాటిజివ్ టాక్ లభించింది. అదలా ఉంటే.. సినిమా విడుదల సందర్భంగా సెట్‌లో తీసిన కొన్ని బీటీఎస్ ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. థామా.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. మొదటి కాల్‌షీట్ నుంచి చివరి కట్ వరకు – ఈ సినిమా నాకు కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు… ఇది నా మనసుతో చేసిన ప్రయాణం. ఇందులో నవ్వులు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, అలసటతో మేల్కొనాలనిపించని ఉదయాలు ఉన్నాయి, ముగియకూడదనిపించిన రాత్రులు ఉన్నాయి.
నన్ను నమ్మి ‘తడాక’ పాత్రలో అవకాశం ఇచ్చినందుకు, నాలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తెచ్చినందుకు డినో సర్, అమర్ కౌశిక్ సర్ కు ధన్యవాదాలు. దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ సర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మారు, నన్ను సవాలు చేశారు, సినిమాలోని సారాన్ని నాకు చూపించారు. మీ విశ్వాసం, మార్గదర్శకత ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయుష్మాన్ ఖురానా, పరేష్ రావల్ సర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ సర్.. మీతో కలిసి పనిచేయడం ఎంతో సహజంగా, సులభంగా అనిపించింది. ఈ సినిమాలో మీతో ఉండటం ఒక అద్భుతమైన అనుభవం. మా క్రూ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఉదయాన్నే వచ్చి, రాత్రివేళల వరకు కష్టపడ్డ వారు, పర్వతాలపై సామాగ్రి మోసిన వారు, వాతావరణ మార్పులతో పోరాడిన వారు, గాయాలను ప్యాచ్ చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వల్లే షూటింగ్ సజావుగా సాగింది. థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఆ కష్టాలన్నీ ఫలించినట్టు అనిపించింది.
ఈ ఫోటోలు షూటింగ్ సమయంలో నా జీవితంలోని చిన్న చిన్న క్షణాలను చూపిస్తాయి. కొన్ని రోజులు మేకప్ తీసేసేంత సమయం కూడా ఉండేది కాదు. కొన్ని రోజులు రోజు ముగియకూడదనిపించేది, మరికొన్ని రోజులు డైలాగులు చెప్పడానికి కష్టపడుతుంటే ఆదిత్య సర్ పక్కనే కూర్చుని సహాయం చేసేవారు. ఇలా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు… ఇవన్నీ నాకు చాలా విలువైనవి “ అంటూ రష్మిక తన పోస్ట్ లో పేర్కొన్నారు. అదే విధంగా తనను అభిమానించేవారిని ఉద్ధేశిస్తూ.. “ మీ ప్రేమ, మీ మద్దతు, మీ నమ్మకం, మీ ఎదురు చూపులు… ఇవన్నీ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా థామా విడుదలైంది. మీరు సినిమాను చూసి ఆనందిస్తారు. అందరికీ ప్రేమతో, గర్వంతో కృతజ్ఞతలు“ అంటూ రష్మిక తన నోట్‌లో రాసుకొచ్చారు.


