- పార్టీలో ఆయన సీనియర్ నేత
- సురేఖ వివాదం ముగిసింది
- తన కూతురు పొరపాటున మాట్లాడిందని సంజాయిషీ ఇచ్చారు
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- సున్నితమైన అంశాలపై సంయమనం పాటించాలి
- జాగ్రత్తగా మాట్లాడాలని ప్రజాప్రతినిధులకు సూచన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తనను మానసికంగా హింస పెడుతున్నారని.. ఆపార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని.. ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తామన్నారు. జీవన్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే అక్కడి మంత్రి లక్ష్మణ్ పరిష్కరిస్తారని చెప్పారు. మంత్రుల్లో తనకంటే సీనియర్లు ఉన్నారని.. తనకంటే జూనియర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.
మంత్రులందరూ సమానమే..
నిన్నటితో మంత్రి కొండా సురేఖ వివాదం ముగిసిందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. కొండా సురేఖతో మాట్లాడమని సీఎం రేవంత్ ఆదేశించారని.. ముఖ్యమంత్రికి మంత్రులందరూ సమానమేనని స్పష్టం చేశారు. సురేఖకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రితో చెప్పానని.. తన కూతురు పొరపాటున మాట్లాడిందని కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఇక నుండి ఏ సమస్య ఉన్నా తనకే చెప్పమని సురేఖతో సీఎం రేవంత్ చెప్పారని వివరించారు. పార్టీలో ఉన్న సమస్యలను క్రమశిక్షణ కమిటీ పరిష్కరిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమస్యలను చాలా పెద్ద మనసుతో పరిష్కారం చేసుకుంటామని చెప్పారు.
వాడెవడు పెత్తనం చెలాయించడానికి ..
తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారు ? అంటూ సోమవారం జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు అసహనం వ్యక్తం చేయడం కలకలంరేపింది. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని మండిపడ్డారు. తాము వలసదారులమేమీ కాదని ఆగ్రహించారు. తాము కాంగ్రెస్ కౌలుదారులం కాదని.. పట్టాదారులమంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వాడెవడు అసలు మా మీద పెత్తనం చెలాయించడానికి ? మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు! ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ది చేస్తాం అని బోర్డు పెట్టుకున్నారా?’ అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.


