- సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా సంస్మరణ దినోత్సవం
- అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు వీర జవాన్లు, సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్ కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్ కు చెందిన సురేష్ లు విధి నిర్వహణలో వీరమరణం పొందారని తెలిపారు.
కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి. వారి ధైర్యం, నిబద్ధత వలననే మనం నేడు సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పోలీసులు ప్రజల భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు” అన్నారు. పోలీసు అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తోందని, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, శ్రీనివాస రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, సైదా నాయక్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


