- మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై తాటికొండ ఆరోపణలు
- ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయినీది కాదంటూ నాయిని ఫైర్
- వరంగల్ జిల్లాలో పొలిటికల్ హీట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి పాలనపై రాజయ్య వ్యాఖ్యలకు రాజేందర్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, 30శాతం కమీషన్లు ఇచ్చిన వాళ్లకే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక.. బీసీ మంత్రి కొండా సురేఖను మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. రాజయ్య ఆరోపణలపై ఘాటుగా స్పందించారు నాయిని రాజేందర్‌రెడ్డి. రాజయ్యకు సిగ్గూ శరం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రజలకు సుభిక్ష పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
2, 7ం వేల కోట్ల అప్పులు..
తెలంగాణ ప్రభుత్వం 2, 7ం వేల కోట్ల అప్పులు చేసిందని తాటికొండ రాజయ్య ఆరోపించారు. 10 నుంచి 30 శాతం కమీషన్లు ఇచ్చిన వాళ్లకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని, తన సీఎం సీటును కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. బీసీ బిడ్డ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి దించేందుకు ప్రయత్నిస్తున్నారని.. స్వయంగా ఆమె కూతురు రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారని రాజయ్య ఆరోపించారు. అంతేగాక రేవంత్‌రెడ్డిపై అనేక క్రిమినల్ కేసులున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో వర్గపోరుపై తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలకు కారణం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరే అంటూ ఆరోపణలు గుప్పించారు. కొండా సురేఖ మంత్రి పదవి లాక్కోవాలని కడియం కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీసీ మంత్రిని కావాలనే మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి కలిసి కొండా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
సిగ్గు, శరంలేదు : నాయిని
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాటికొండ రాజయ్యకు సిగ్గు, శరం లేదు.. అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజయ్యను కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేశారో ఇప్పటి వరకూ తెలియదన్నారు. రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే… మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో వ్యవస్థలో గౌరవం లేకుండా, అభద్రత భావాన్ని కలిగించేలా చేశారని మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల శవాలపై పేలాలు ఏరుకొని తిన్న బీఆర్ఎస్ పార్టీదని ఘాటుగా విమర్శించారు.


