- కన్నుల పండుగగా లక్ష్మీ కుబేర హోమం, దీపావళి పూజలు
- భక్తులకు మహా ప్రసాదంగా నవరాత్రి అలంకరణ నోట్లు పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : జిల్లాకేంద్రంలోని శ్రీ మహాశక్తి దేవాలయం దీపావళి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో ఆలయంలో దీపావళి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ధన త్రయోదశి సందర్భంగా అమ్మవార్లకు నాణాలతో పూజ, పుష్పాభిషేకం, మంగళద్రవ్యాభిషేకం నిర్వహించారు. నరక చతుర్దశి, దీపావళి రోజు లక్ష్మీ కుబేర హోమం, మహాహారతి, పూర్ణాహుతి ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించిన కరెన్సీ నోట్లు, గాజులు, కుంకుమ, అమ్మవారి చిత్రాలు ఆలయ నిర్వాహకులు భక్తులకు మహా ప్రసాదంగా అందజేశారు.


