- కొండా సురేఖ మంత్రి పదవిని గుంజుకునేందుకు పక్కా ప్లాన్
- వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి, రేవూరితో కలిసి పథకం
- బీసీ మహిళ అయిన మంత్రిపై నేతల వేధింపులు
- కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు
- శ్రీహరిపై గతంలోనూ కొండా సురేఖ హాట్ కామెంట్స్
- కడియం నల్లికుట్లోడు అంటూ ఆగ్రహం
- తన మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం చేస్తున్నాడని ఫైర్
- తాజాగా రాజయ్య ఆరోపణలతో మరింత కలకలం
- వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో గందరగోళం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య నెలకొంటున్న విబేధాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం జాతరకు సంబంధించిన పనుల విషయంలో విబేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంత్రి ఇంటిని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపై మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత రాజయ్య స్పందించారు. ఈక్రమంలో కడియం శ్రీహరిపై సంచలన కామెంట్స్ చేశారు.
మొదటి నుంచి గ్రూప్ రాజకీయాలే..
తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రి పదవిని గుంజుకునేందుకు కడియం శ్రీహరి స్కెచ్ వేశాడు. టీడీపీ నుంచి వచ్చిన వారితో జతకట్టి పక్కా ప్లాన్ వేశాడు. కడియంకు వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోడయ్యారు. మంత్రి కొండా సురేఖపై కుట్రలో ప్రధాన పాత్ర కడియం శ్రీహరిదే. బీసీ మహిళ అయిన మంత్రి కొండా సురేఖను వారు చిత్రహింసలకు గురిచేస్తున్నారు అంటూ రాజయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ లోనూ కడియం శ్రీహరి ఇలాంటి గ్రూపు రాజకీయాలు చేశాడు. కాంగ్రెస్ లోనూ అదే ప్లాన్ అమలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీలోని కొందరు మంత్రులు, నేతల తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని తాటికొండ రాజయ్య హెచ్చరించారు.కొండా సురేఖపై రెడ్డి సామాజిక వర్గం నేతలు కుట్రలు చేయడం వాస్తవమేనని రాజయ్య అన్నారు. కేబినెట్లోని మంత్రుల కాంట్రాక్ట్ సంస్థలకే సీఎం రేవంత్ రెడ్డి బిల్లులు క్లియర్ చేస్తున్నాడు. 10 నుంచి 30 శాతం వరకు కమిషన్లు ఇస్తేనే బిల్లులు రేవంత్ నుంచి క్లియర్ అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులకు మాత్రమే న్యాయం జరుగుతుందని తాటికొండ రాజయ్య విమర్శించారు.
కడియం నల్లికుట్లోడు
మంత్రి కొండా సురేఖ సైతం కడియం శ్రీహరిపై ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ సంబోధించారు. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ వ్యాఖ్యనించారు. అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు, మంత్రి పొంగులేటి వద్దకు వెళ్లి తన మీద ఉన్నది లేనిది చెబుతున్నాడంటూ సురేఖ కామెంట్ చేశారు. టీడీపీలో నడిచినట్లే.. కాంగ్రెస్ లో కూడా నడుస్తుందని ప్లాన్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన, తనకు అదృష్టం ఉన్నప్పుడు తాను మంత్రి అయ్యానని తెలిపారు. తన కూతురికి అదృష్టం లేదు కాబట్టే ఎమ్మెల్యే కాలేదని, కడియం కూతురికి అదృష్టం ఉంది కాబట్టే ఎంపీ అయిందన్నారు. ఇప్పుడు తాను ఆమె పదవిని తీయించాలని అనుకోవడం సరికాదన్నారు. మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి.


