- ములుగు జిల్లా ఎస్పీ శబరీష్
- నలుగురు మావోయిస్టుల లొంగుబాటు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పోలీసులు చేపట్టిన ‘పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి’ అనే అవగాహన కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పునరావాస సదుపాయాల ప్రభావం వల్ల మరో నలుగురు అజ్ఞాత మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు మడవి కోసి అలియాస్ పైకి (20), మడవి ఎడుమె (21), ముచ్చాకి దేవా (21), మడకం బండి (32) లొంగిపోయి శాంతియుత జీవితాన్ని ఎంచుకున్నారు. వీరిలో ముగ్గురు పార్టీ సభ్యులు కాగా, ఒకరు మిలీషియా కమాండర్‌గా పనిచేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ సరెండర్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున పునరావాస నిమిత్తం నగదు బహుమతులు జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు. ఈ యేడు తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ములుగు జిల్లాలో మొత్తం 84 మంది వివిధ హోదాల్లోని మావోయిస్టులు లొంగిపోయి ప్రజాస్రవంతిలో కలిశారు.
వారిలో డీవీసీఎంఎస్-3, ఏసీఎంఎస్-11, పార్టీ సభ్యులు-28, మిలీషియా కమాండర్లు-32, ఆర్పీసీ-1, డీఏకేఎం ఎస్/కే ఏ ఎం ఎస్-2, సీఎన్ ఎం-7 మంది ఉన్నారని ఎస్పీ తెలిపారు. వీరందరికీ ప్రభుత్వ పునరావాస పథకంలో భాగంగా తగిన ఆర్థిక, వైద్య సామాజిక సదుపాయాలు అందజేయబడుతున్నాయని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో క్రింది స్థాయి క్యాడర్లు పై నాయకత్వంపై అసంతృప్తితో రహస్య జీవితం వదిలి కుటుంబాలతో కలిసి ప్రశాంత జీవితం గడపడానికి ముందుకు వస్తున్నారని ఎస్పీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పూర్తి భద్రత తదితర అవసరమైన సహకారం అందిస్తోంది అని ఎస్పీ పేర్కొన్నారు.


