- కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్: మానకొండూరు మండలం వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. కలెక్టర్ పీహెచ్ సీ లోని ల్యాబ్, మెడిసిన్ స్టోర్స్, వ్యాక్సిన్లు నిల్వ చేసే గది, లేబర్ రూమ్, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి రిజిస్టర్లు, రోగుల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవల వివరాలను పీహెచ్సీ వైద్యాధికారి సాయి ప్రసాద్ నుంచి తెలుసుకున్నారు. సత్పతి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి వైద్య పరీక్షలు పూర్తయ్యేలా చూడాలని, స్క్రీనింగ్ పూర్తయి ఆరు నెలలు గడిచిన మహిళలకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గర్భిణీలకు ప్రసవాలు ఆసుపత్రిలో చేయించుకోవాలన్న అవగాహన కల్పించాలని, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రతినెలా ఉచిత మందులు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని సిబ్బందికి తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆమె వెంట డీఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, వైద్యులు వెంకటేష్, తహసీల్దార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.


