- జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : ఖో ఖో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కరీంనగర్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జట్ల ఎంపిక పోటీలను అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలను ముఖ్య అతిథిగాసుడా చైర్మన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, నిత్య శిక్షణతోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి వి. శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచేలా శ్రద్ధ పెట్టాలని సూచించారు. 225 మంది క్రీడాకారులు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి హాజరయ్యారు. వీరిలో 20 మంది మహిళలు, 20 మంది పురుషులను రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. పోటీల ముగింపు సమావేశానికి పెద్దపల్లి జిల్లా యువజన క్రీడాధికారి ఏ. సురేష్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు ఏ. లక్ష్మణ్, మానకొండూర్ జూనియర్ కళాశాల లెక్చరర్ టి. రమేష్ హాజరై ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.


