- 42% రిజర్వేషన్ కోసం కదం తొక్కిన ఓరుగల్లు
కాకతీయ, వరంగల్ బ్యూరో : మేమెంతో… మాకంత! అనే నినాదంతో హనుమకొండ వీధులు మారమోగాయి. ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో సబ్బండ కులాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, కార్మికులు, దళిత, మైనారిటీ సంస్థలు కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఏకమయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదాలత్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా కదిలిన బీసీ ఉద్యమ కవాతు ఊరంతా హోరెత్తించింది. సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, మేధావులు, బీసీలు కలిసి పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే 42 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని అన్నారు.
విద్యార్థుల కదలికతో ఊగిపోయిన ఓరుగల్లు..

అంబేద్కర్ సెంటరు నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు సాగిన కవాతులో విద్యార్థులు చీమల దండులా కదిలారు. రెండు గంటల పాటు కాళోజీ సెంటర్, ఎన్పీడీసీ ఎల్ ఆఫీస్ మీదుగా సాగిన ర్యాలీ నగరాన్ని స్తంభింపజేసింది. ర్యాలీకి ముందే పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏసీపీ, ముగ్గురు సీఐలు, పలువురు ఎస్సైలు పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ సజావుగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..
హనుమకొండ బస్ డిపో ఎదుట ఉదయం నుంచే బీసీ ఉద్యమకారులు ధర్నా నిర్వహించారు. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు, మహిళా సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిరసన చేపట్టారు. బీసీ ఉద్యమం ఇక బహుజన సమరంగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఉద్యమ పట్టుగొమ్మ ఓరుగల్లు..
విద్యార్థులు, మేధావులు, సామాజిక సంస్థలు, కార్మికులు కలిసి శనివారం బీసీ బంద్ ను ప్రజా సమరంగా మార్చారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ర్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల పోరాటానికి నాంది పలికింది. కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, వేణుమాధవ్, మౌనిక గౌడ్, తీగల భరత్ గౌడ్, రాజేష్ కుమార్, బోనగాని యాదగిరి గౌడ్, రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


