కరీంనగర్లో ఉద్రిక్తత బీసీ బంద్ అమలులో ఘర్షణాత్మక పరిస్థితులు…
కాకతీయ, కరీంనగర్ : 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ పిలుపు నేపథ్యంలో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి సీపీఐ, బీసీ సంఘాల నేతలు బంద్ విజయవంతం చేసేందుకు రోడ్లపైకి దిగారు. బంద్ పిలుపును విస్మరించి తెరిచి ఉన్న పలు హోటళ్లు, వ్యాపార సంస్థల వద్ద ఆందోళన కొనసాగించారు.ఈ సందర్భంగా నాయకులు హోటళ్లలోని సామాన్లు, కుర్చీలు, ప్లేట్లు పగలగొట్టి నిరసన తెలిపారు. బంద్‌కు మద్దతివ్వకుండా దుకాణాలు ఎందుకు తెరిచారంటూ వ్యాపారులను ప్రశ్నించారు. కొన్నిచోట్ల వ్యాపారులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.బంద్‌ను సమర్థిస్తూ నేతలు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. బీసీ హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



