ఘరానా మోసం
వృద్ధురాలి నుంచి రూ.35 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
లండన్‌లో మీ కుమారుడికి యాక్సిడెంట్ అంటూ ఫోన్ కాల్..
చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి..
అడిగినంత డబ్బును కేటుగాళ్లకు పంపిన బాధితురాలు
ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో దాటవేత..
కొడుక్కు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి..
మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : లండన్‌లో ఉంటున్న కుమారుడికి ప్రమాదం జరిగిందంటూ నమ్మించి ఓ తల్లి వద్ద సైబర్ మాయగాళ్లు రూ.35 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అనంతరం మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలికి వాట్సప్ కాల్ చేసిన వ్యక్తి తన పేరు స్టీవ్ రోడ్రిగ్జ్ అని, లండన్ లోని సౌత్ మంచెస్టర్ హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. “లండన్ విమానాశ్రయంలో మీ కుమారుడికి ప్రమాదం జరిగింది, తలకు బలమైన గాయాలయ్యాయని” మాయమాటలు చెప్పాడు. లగేజీ మిస్ అవ్వడంతో ఎలాంటి ఐడెంటిటీ లేకపోవడంతో ఏ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోలేదని తాను చట్ట విరుద్ధంగా చికిత్సను అందిస్తున్నట్లుగా తెలిపారు.
పోలీసుల దర్యాప్తు..
చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని బాధిత వృద్ధురాలిపై ఒత్తిడి తెచ్చారు. కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన చెందిన ఆమె ఆలోచించకుండా పలు దఫాలుగా 35 లక్షల వరకు డబ్బులను వారికి బదిలీ చేశారు. తన కుమారుడి ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో సైబర్ మాయగాళ్లు దాటవేస్తూ సమాధానం ఇచ్చారు. అనుమానం వచ్చి తన కొడుకు నెంబర్‌కు కాల్ చేయడంతో అసలు విషయం బయటపడింది. కాల్‌ను లిఫ్ట్ చేసిన కుమారుడు తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. దీంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


