కులగణన సర్వేలో పాల్గొనం
తాము వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్లం కాదు
వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం
సర్వేతో ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండబోదు
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో తమ వివరాలను పంచుకోవడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి నిరాకరించారు. తాము వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని అధికారుతో తెలిపినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
నారాయణమూర్తి నివాసానికి సర్వే సిబ్బంది
సామాజిక, ఆర్థిక గణనలో భాగంగా బెంగళూరులోని జయానగర్లోని నారాయణమూర్తి నివాసానికి సర్వే సిబ్బంది వెళ్లారు. అయితే నారాయణమూర్తి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంలో వారికి నిరాశ ఎదురైంది. వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహించిన జనాభా లెక్కల్లో తన కుటుంబ సభ్యులు పాల్గొనబోమని, తమ ఇంట్లో ఈ సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండబోదని నారాయణమూర్తి దంపతులు తెలిపారు. ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
నారాయణమూర్తి నిరాకరణపై స్పందించిన డిప్యూటీ సీఎం
మరోవైపు కుల గణన సర్వేలో పాల్గొనడానికి నారాయణమూర్తి నిరాకరించడంపై కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీ కే శివకుమార్ స్పందించారు. ఇది వారి వ్యక్తిగత విషయమని, సర్వేలో వివరాలు తెలపాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని ఆయన తెలిపారు. ఇది వారి ఎంపిక అని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తిగా స్వచ్ఛందంగా చేపడుతున్న గణన అని పేర్కొన్నారు.


