నిన్న అభయ్..నేడు ఆశన్న !
జన జీవన స్రవంతిలోకి మావోయిస్టులు
అడవులను వీడుతున్న అగ్రనేతలు
ఆయుధాలు వదిలేసి లొంగుబాట్లు..
రెండ్రోజుల్లో మొత్తం 258 మంది సరెండర్
నక్సల్స్ రహిత ప్రాంతాలుగా ఒకప్పటి కంచుకోటలు..
లొంగిపోకుంటే తుపాకులే సమాధానం చెప్తాయి..
ఆయుధాలతో పోరాడేవారికి అమిత్ షా వార్నింగ్ !
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామంటూ పునరుద్ఘాటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో అన్నలు అడవులను వీడుతున్నారు. ఆయుధాలను వదిలేసి అగ్రనేతలు ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఓవైపు ఆపరేషన్ ఖగార్ పేరుతో భారీఎత్తున భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులను మట్టుబెడుతున్నాయి. మరోవైపు.. లొంగిపోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుతో మావోయిస్ట్ అగ్ర నాయకులు సైతం తమ దళ సభ్యులతో సరెండర్ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఒకప్పుడు నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న ప్రాంతాలు కూడా నేడు నక్సల్స్ రహిత ప్రాంతాలుగా మారుతున్నాయి.
చర్చల ప్రతిపాదనకు నో..
చర్చల ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించటంతో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరు లొంగిపోతున్నారు. బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి 60మంది కేడర్‌తో కలిసి లొంగిపోగా, ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేష్ జనజీవన స్రవంతిలో కలిశారు. ముగ్గురు డివిజన్ కార్యదర్శులు, ఐదుగురు దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యులు, 20 మంది DVC సభ్యులు సహా 169 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో జగదల్‌పుర్‌లో అధికారికంగా లొంగిపోయినట్లు సమాచారం. 70కిపైగా ఆయుధాలు అప్పగించనున్నట్లు తెలిసింది.
వనంవీడి జనంలోకి..
గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మొత్తం 258 మంది నక్సలైట్లు ఆయుదాలు వీడి లొంగిపోయారని కేంద్రమంత్రి అమిత్ షా తాజాగా వెల్లడించారు. దీంతో దేశంలో నక్సలిజాన్ని అంతం చేసే పోరాటంలో ఇదొక కీలక ఘట్టమని అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ ఒక్కరోజే 170 మంది మావోయిస్ట్‌లు లొంగిపోగా.. నిన్న 27 మంది ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి చేరారు. మహారాష్ట్రలో మంగళవారం 61 మంది నక్సలైట్లు లొంగిపోయారు. దీంతో కేవలం రెండు రోజుల్లో 258 మంది మావోయిస్ట్‌లు అడవులను వీడి జనంలోకి వచ్చారు. ఇక లొంగిపోయిన ఈ మావోయిస్ట్‌లు భారత రాజ్యాంగంపై తిరిగి విశ్వాసాన్ని వ్యక్తం చేయడంపై కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
2026 మార్చి 31లోగా నక్సలిజం అంతం
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ విషయంలో తమ విధానాన్ని మరోసారి స్పష్టం చేసింది. లొంగిపోవాలనుకునే మావోయిస్ట్‌లకు స్వాగతం అని.. ఆయుధం పట్టుకోవాలని చూసేవారికి బలగాల ప్రతాపం తప్పదు అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. 2026 మార్చి 31వ తేదీలోగా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరోమారు ఉద్ఘాటించింది. 2024 జనవరిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. 2,100 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. మరో 1,785 మందిని అరెస్ట్ చేశారు. ఇక భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లలో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కలు చూస్తుంటే.. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ పట్టుదలకు సానుకూల ఫలితాలే ఇస్తున్నాయి.
నక్సల్ రహిత ప్రాంతాలు..
ఒకప్పుడు నక్సల్స్‌కు కంచుకోటలుగా.. అడ్డాలుగా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలను ప్రస్తుతం నక్సల్స్ రహిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. దక్షిణ బస్తర్‌లో మాత్రమే ఇంకా కొద్దిగా నక్సలిజం జాడ మిగిలి ఉందని.. దాన్ని కూడా భద్రతా బలగాలు త్వరలోనే తుడిచిపెడతాయని కేంద్రం వెల్లడించింది.
అమిత్ షా వార్నింగ్ !
ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. 170 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రెండు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిందని అన్నారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది, మహారాష్ట్రలో 61మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. రెండ్రోజుల్లో మొత్తం 258మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. హింసా మార్గం వీడి రాజ్యాంగంపై విశ్వాసం చూపటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాల వల్ల నక్సలిజం కొన ఊపిరిపై ఉందన్న సత్యాన్ని ఈ లొంగుబాట్లు చాటుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. లొంగుబాట్లను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆయన, ఆయుధాలతో పోరాడేవారికి భద్రతాదళాలే తగిన సమాధానం చెబుతాయన్నారు. జనజీవన స్రవంతిలో కలవాలని తుపాకీతో పోరాటం చేస్తున్నవారికి మరోసారి పిలుపునిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టించటానికి కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా తేల్చి చెప్పారు.
ఎవరీ ఆశన్న..
ములుగు జిల్లా లక్ష్మీదేవిపల్లి చెందిన ఆశన్న I.T.I., పాలిటెక్నిక్ చదివారు. గెరిల్లా దాడుల్లో, యుద్దతంత్రాల్లో ఆరితేరారనే ప్రచారం ఉంది. 1991లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరిన ఆయన, 1999లో పీపుల్స్‌వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్‌కు ఆయనే నేతృత్వం వహించినట్లు ప్రచారంలో ఉంది. అంతేగాక 2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చేసి చంపేయడం, 2003లో అలిపిరిలో సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను క్లెమోర్‌మైన్‌తో పేల్చి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన దుశ్చర్యలతో ఆశన్న పేరు విస్తృతంగా ప్రచారమైంది.


