- విజయ్ సామాజిక స్పృహకు “ నా ఆలోచనలు “ నిదర్శనం
- కొనియాడిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ, హైదరాబాద్ : గొప్ప సామాజిక స్పృహతో, తెలంగాణ మీద మమకారంతో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంపై పిన్నింటి విజయ్‌కుమార్ వ్యాసాలు రాయడం అభినందనీయమని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు పిన్నింటి విజయ్ కుమార్ రాసిన అనేక వ్యాసాలను “ నా ఆలోచనలు “ అనే శీర్షికతో ఒక మంచి పుస్తకం రాయడం గొప్ప పరిణామమని కేటిఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం గురించి, ప్రాంతీయ, జాతీయ పరిస్థితులపై చాలా మంచి అవగాహనతో ఎన్నో వ్యాసాలను గతంలో రాశారు. ఇప్పుడు కొత్తగా ఆ వ్యాసాలన్నింటిని ఒక “ నా ఆలోచనలు “ అనే పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నారు.
నా చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం ఆనందంగా వుందని కేటిఆర్ అన్నారు. పుస్తక పఠనం తగ్గిపోయిన ఈ రోజుల్లో ఇట్లాంటి యువ రచయితలు ముందుకు వచ్చి పుస్తకాలు రాస్తున్న విజయ్ లాంటి వారిని తప్పకుండా ప్రోత్సహించాలని కేటిఆర్ కోరారు. అనంతరం రచయిత, విద్యార్థి నాయకుడు విజయ్ ని అభినందించారు. ఈ సందర్భంగా జనగామ శాసన సభ్యులు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు ప్రత్యేకంగా పుస్తక ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్య, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శేరి సుభాష్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, కాకతీయ యూనివర్సిటీ బిఆర్ఎస్వి ఇంచార్జి జెట్టి రాజేందర్, రాజేష్ నాయక్, ప్రశాంత్, అభిషేక్, నితిన్, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొని విజయ్ కి అభినందనలు తెలిపారు..


