కొండా సురేఖ మంత్రి పదవి ఊగిసలాటలో..?
సురేఖ కూతురు వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం..!
కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు – రేవంత్ నిర్ణయం ఏంటి..?
మేడారం పనులు ఆర్‌అండ్‌బీకి బదిలీ.. సురేఖకు మరో షాక్..
టెండర్లు, సెటిల్మెంట్లు పేరుతో దోపిడీ ఆరోపణలు.. రేవంత్ వర్గం ఆగ్రహం..
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త భూకంపం.. మంత్రి సురేఖ భవితవ్యం ఏంటి..?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గంలో మరో రాజకీయ భూకంపానికి వేదికగా మారనుంది నేడు కేబినెట్ సమావేశం. మంత్రి కొండా సురేఖ పదవిపై వేటు వేయాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సురేఖ కూతురు కొండా సుష్మిత ఇటీవల మీడియా ఎదుట చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు కారణ మయ్యాయని చెబుతున్నారు. సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి, సీఎం సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి పేర్లు ప్రస్తావిస్తూ టెండర్లు, సెటిల్మెంట్లు పేరుతో దోపిడీలు జరుగుతున్నాయి అని బహిరంగంగా ఆరోపించిన సుష్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గతంగా కలకలం రేపాయి. సురేఖ కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇన్‌సైడ్ బ్లాస్ట్ తో రేవంత్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోవాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సర్కిల్‌లలో చర్చ.
మేడారం పనులు ఆర్ అండ్ బీకి బదిలీ..
ఇక మరోవైపు కొండా సురేఖకు చెందిన దేవాదాయశాఖ పరిధిలో ఉన్న మేడారం జాతర పనులను రోడ్లు, భవనాల శాఖ (ఆర్ & బీ ) కు బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య ఏర్పడిన విభేదాలు, అంతర్గత విరోధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించిన రికార్డులు, టెండర్ ప్రక్రియను దేవాదాయశాఖ నుంచి ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చివరికి కొండా సురేఖ మంత్రి పదవిపై వేటు వేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశంలో అంశంపై చర్చ జరిగే సూచనలు ఉన్నట్లు సమాచారం. సురేఖ కూతురు వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. మేడారం పనులు దేవాదాయశాఖ నుంచి ఆర్‌అండ్‌బీకి బదిలీ చెయ్యడంలో మరిన్ని అంతర్గత విబేధాలు బయటపడనున్నాయి. పార్టీ అంతర్గత రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, రేవంత్ నిర్ణయం ఏదోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాలు.


