- దళిత ఐపీఎస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
- ప్రధాని లేఖ రాసిన నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంలో లేఖను అందజేసిన అనంతరం.. ఎంపీ మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.
చాలా దురదృష్టకరం
‘హర్యానాలో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐఎంలలో చదివి.. అతి చిన్న వయస్సులోనే సివిల్స్ రాసి ఐపీఎస్ అధికారి అయ్యారు. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన పైఅధికారుల ఒత్తిడి కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అతని సూసైడ్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరాం. అలాగే.. మరోచోట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం’ అని మల్లు రవి వివరించారు. ‘ఆత్మహత్య చేసుకొని వారం గడుస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం జరగలేదు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అతని భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా హోంమంత్రి వారి డిమాండ్లను అమలు చేయాలి. షెడ్యూల్ క్యాస్ట్ పార్లమెంట్ మెంబర్‌గా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. దీనికి సంబంధించిన లెటర్‌ను కూడా ప్రధాని కార్యాలయంలో అందజేశాం’ అని ఎంపీ చెప్పారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి
‘ఆత్మహత్యకు పాల్పడ్డ ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులకు కూడా లేఖ రాశాం. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చాం. దేశంలోని దళితులందరూ మద్దతుగా నిలుస్తారని లేఖలో ధైర్యాన్నిచ్చాం. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ మీటింగ్‌లో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇవాళ కమిటీ సమావేశం జరగనుంది. ఐపీఎస్ అధికారి సూసైడ్ ఘటనను కమిటీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్తా. బాధ్యులైన డీజీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతా. అంతేకాకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు కూడా దీని గురించి వివరిస్తా. ప్రధానికి రాసిన లేఖను అందజేస్తా. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరతా. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఈ లేఖలను పంపిస్తా. అంతేకాకుండా.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలను కలుస్తా. అందరం కలిసి ప్రధాని, హోంమంత్రిని కలిసి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయాలని వారికి తెలియజేస్తాం. అవసరమైతే వారి అందరితో కలిసి చండీఘర్ వెళ్తాం. వారి కుటుంబానికి అండగా నిలుస్తాం.’ అని స్పష్టం చేశారు.


