- షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో తొలిసెట్ అందజేత
- హాజరైన కేటీఆర్, ముఖ్య నేతలు
- నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు ప్రచారం..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, సమీనా యాస్మిన్‌తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 11న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఓటర్లకు బాకీ కార్డు..
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ రవిచంద్ర, సునీత కార్పొరేటర్స్ రాజ్ కుమార్ పటేల్,హేమ, నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్, వాసాల వెంకటేష్, పర్వతం సతీష్, నర్సింగ్ తదితర నాయకులతో కలిసి మంగళవారం యూసఫ్ గూడ మెట్రో స్టేషన్, చెక్ పోస్ట్, లక్ష్మీనరసంహా నగర్, ప్రగతినగర్ తదితర చోట్ల కాలినడకన ఎన్నికల ప్రచారం జరిపారు. గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికీ “బాకీ కార్డు”లను ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు సునీతకు బొట్టు పెట్టి, శాలువాలతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు.


