- ఆడబిడ్డను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గం
- కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
- జుబ్లిహిల్స్‌లో ఓట్ చోరీపై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్
- కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణకు ప్రమాదమేనంటూ వ్యాఖ్య
- నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: భర్తను తలచుకుని బాధలో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా మాట్లాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీత దుఃఖాన్ని అవమానించేవిధంగా కాంగ్రెస్ మంత్రులు నానా మాటలు మాట్లాడుతున్నారని, విజ్ఞత మరచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి 200మంది బీఆర్‌ఎస్‌లోకి చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి గోపీనాథ్ ఐదేండ్ల కోసం బీఆర్‌ఎస్ నుంచి గెలిచారని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు చనిపోయారు.. అందుకే జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చామని తెలిపారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు.
ప్రజలు విజ్ఞులు..
ప్రజలు విజ్ఞులు.. ప్రజలు మంచి, చెడు ఆలోచిస్తారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ అంటున్నాడని.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేస్తుంటే ఎందుకు మాట్లాడవని రాహుల్ గాంధీని నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఓటు చోరీ చేయకుండా నిజాయితీగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో భర్తను కోల్పోయిన సునీతను ఒడడగొట్టాలని 20 వేల దొంగ ఓట్లను కూడగట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి అని అవిమర్శించారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాణ్ అని అంటారు. మోదీ సబ్ కా సాత్ సబ్‌కా వికాస్ అంటారని గుర్తుచేశారు.
పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు..
హైడ్రా పేరిట పేదవారి ఇల్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణ్ ఆ అని ప్రశ్నించారు. పెద్దపెద్ద ఇల్లులు కూల కొట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్లల్లనే ఉంటది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు హైడ్రాలనే ఉంటది. ఎమ్మెల్యే గాంధీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఉంటాడని అన్నారు. పండుగ పూట ఆదివారం నాడు రాత్రి వచ్చి గరీబోళ్ల ఇల్లు కూలగొట్టి వేల కుటుంబాలను రోడ్డుమీదికి తెచ్చిండు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు.. పేదోళ్ల ఇల్లులు ఎందుకు కూలగొడుతున్నావ్ రేవంత్ రెడ్డి అని రాహుల్ గాంధీ ఎందుకు అడగడం లేదని హరీష్‌రావు ప్రశ్నించారు.


