కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈనెల 7న పాఠశాలలో విద్యార్థి వివేక్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిపై మంత్రి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. తోటి పిల్లలతో ఆడుకుంటూ విద్యార్థి వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం దురదృష్టకమని, ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదవశాత్తు మరణం అని తేలిందని అన్నారు. అయితే, మరేదైనా కోణం ఉందా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోందన్నారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ పక్షాన అన్ని విధాలా సహాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.


