- సెంట్రల్ జిల్లా పార్టీ అధ్యక్షుడి వైపే అధిష్టానం మొగ్గు
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసే బీజేపీ అభ్యర్థిని ఆపార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని పలువురి సీనియర్ల పేర్లను బీజేపీ పరిగణలోకి తీసుకుంది. అందుకు సంబంధించిన జాబితాను రూపొందించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకు వెళ్లి.. అధిష్టానం ముందు ఉంచారు. అధిష్టానం లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది. సెంట్రల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దీపక్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

నవంబర్ 11న పోలింగ్..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ బరిలో దిగి గెలిచారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల మరణించారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఉప ఎన్నిక పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆ క్రమంలో మాగంటి గోపినాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలో దింపింది. అలాగే నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి తాజాగా ప్రకటించింది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది ఆసక్తికరంగా మారింది.


