మహబూబాబాద్ పోలీస్‌శాఖలో కుల వివక్ష
ఎస్టీ ఉద్యోగులపై రెడ్డి అధికారి దౌర్జన్యం?
స్టేషన్‌లోనే బూతు పురాణం ఆ తర్వాత దాడి
ఆనక కానిస్టేబుల్‌ను బదిలీ చేయించిన అధికారి
కాకతీయ ,మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రెడ్డి సామాజికి వర్గానికి చెందిన ఓ పోలీస్ అధికారి కులం పేరుతో ఉద్యోగులను దూషిస్తూ అవమానిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టీ పోలీస్ సిబ్బంది పై దాడికి యత్నించినట్లుగా కూడా వి|శ్వసనీయంగా తెలుస్తోంది. సదరు అధికారి కులం పేరుతో దూషణలకు దిగుతున్నట్లుగా బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్ కలకలం రేపుతోంది. డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాశంగా మారుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్‌ను కులం పేరుతో దూషించడమే కాకుండా దాడికి యత్నించినట్లుగా ఆరోపణలున్నాయి. అంతేకాదు బాధిత ఉద్యోగిగా అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా.. ఇటీవల వేధింపులు పెంచినట్లుగా ఆరోపణలున్నాయి. తనకే ఎదురు తిరుగుతున్నాడని పేర్కొంటూ తనకున్న పలుకుబడితో సదరు కానిస్టేబుల్‌ను సైతం అధికారి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయించినట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్‌ను ఆ స్టేషను పరిధి నుంచి ఎస్పి ఆఫీస్ కి ఈనెల 14 న అటాచ్ చేసినట్లు సమాచారం.
గతంలోనూ అధికారిపై ఆరోపణలు
గతంలోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిపై మాల సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాజాగా మరో ఘటన రావడం గమనార్హం. అయితే చిరు స్థాయి ఉద్యోగుల విన్నపాలు పట్టించుకోకుండా.. అధికారుల సంజాయిషీలకే ఉన్నతాధికారులు కట్టుబడి ఉంటున్నారన్న విమర్శలు జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులపై వినిపిస్తున్నాయి. తాజా సంఘటనలో డీజీపీ దృష్టికి తీసుకెల్లేందుకు పోలీస్ శాఖలోని ఎస్టీ సామాజిక వర్గం ఉద్యోగులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కాకతీయకు విశ్వసనీయంగా తెలిసింది.


