కొడుకు నిర్లక్ష్యంతో భూమిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ..
తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని వారసులకు గుణపాఠంగా నిర్ణయం..
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఎల్కతుర్తి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో, తనకు ఉన్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమి హస్తాంతరణ పత్రాలపై సంతకాలు చేసిన శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రు లను విస్మరించే వారసులకు ఇది గుణపాఠంగా నిలవాలి అని పేర్కొన్నారు. భూమిని తన భార్య జ్ఞాపకార్థంగా పాఠశాల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


