- మంత్రుల మధ్య కాంట్రాక్టు రాజకీయాలు
- అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి
- ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని ఆదివాసీ నాయకురాలు, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బడే నాగజ్యోతీ అన్నారు. మేడారం పవిత్రతను లాభార్జన జాతరగా మార్చే ప్రయత్నం సాగుతోందని ఆరోపించారు. రూ.71 కోట్ల విలువైన అభివృద్ధి టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలు, బహిరంగ ఆరోపణలు పాలకుల మధ్య జరుగుతున్న కాంట్రాక్టు రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. పాలకులు, మంత్రులు, కాంట్రాక్టర్లు కలిసి మేడారం జాతర ఖ్యాతిని మంటగలుపుతున్నారని మండిపడ్డారు.
జాతర అనేది యావత్ దేశ ఆదివాసీ సమాజ విశ్వాసానికి, అస్తిత్వానికి ప్రతీక అని గుర్తు చేశారు. పనుల కేటాయింపులో ఆదివాసీ సంఘాలకు, పూజారులకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రభుత్వం ఆదివాసీ సంప్రదాయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మేడారం జాతరకు 150 కోట్ల రూపాయలు తెచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని, జాతర సమీపిస్తున్నా పనులు ప్రారంభం కాలేదన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తవుతాయా అనే అనుమానం ఉందన్నారు. వెంటనే మేడారం అభివృద్ధి పనుల్లో పారదర్శకత కోసం ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రుల జోక్యాన్ని తగ్గించి కాంట్రాక్టర్ల పెత్తందారితనాన్ని నియంత్రించాలని సూచించారు. అభివృద్ధి ప్రణాళికల్లో ఆదివాసీ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. మేడారం జాతర ఆదివాసీ గౌరవం, సంస్కృతి, విశ్వాసానికి ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు.


