- ఇది తమ కుటుంబ సమస్య, పరిష్కరించుకుంటాం..
- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం
- ఖర్గేను పరామర్శించిన పీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇది చాలా చిన్న అంశమని, తమ కుటుంబ సమస్య అని, దీనిని తామే పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించారు. ఇటీవల ఖర్గేకు పేస్‌మేకర్ అమర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఖర్గేను కలిశారు. బీసీలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్రంలో చేపట్టిన కులఘనన నుంచి జీవో వరకు అన్ని అంశాలను ఖర్గే కు వివరించారు.
రాష్ట్రంలో పరిణామాలపై చర్చ..
అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడం సహా ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు మీడియాకు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కూడా ఉన్నారు.


