- అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస ..
- కొండా వెంకట రంగారెడ్డి మనవడిగా సుపరిచితులు
- కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం
- ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక పదవులు..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రంగారెడ్డి పేరుమీదుగానే ప్రస్తుత రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్‌గా లక్ష్మారెడ్డి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి చైర్మన్‌గా కూడా సేవలందించారు.
రాజకీయ ప్రస్థానం..
లక్ష్మారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆయన 1983-85 మధ్యకాలంలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. అనంతరం 1999, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాలతోపాటు, కొండా లక్ష్మారెడ్డికి జర్నలిజం పట్ల కూడా ప్రత్యేక మక్కువ ఉండేది. ఈ ఆసక్తితోనే ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ అయిన ‘ఎన్.ఎస్.ఎస్.’ను స్థాపించారు. అంతేకాక, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తూ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.


