- వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి
- చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే కోటాలో ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు..?
- రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, గ్రంథాలయం తెచ్చే బాధ్యత కాంగ్రెస్ దే..
కాకతీయ, బోథ్: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బోథ్ ప్రజలను మభ్యపెట్టే పనిలో బోథ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలు ఉన్నారని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. గత పదేళ్లలో బోథ్ అభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకుపోయిన బీఆర్ఎస్ నేతలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బోథ్ అభివృద్ధిపై హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ఆనాడు అధికారం చేతిలో ఉన్నా రెవెన్యూ డివిజన్ ఇవ్వకుండా, డిగ్రీ కాలేజ్ ను తరలించి, గ్రంథాల యం ఏర్పాటును మరిచి, తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన నిధులను మంజూరు కాకుండా అడ్డుకున్నది ఎవరో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టణంలో సెంట్రల్ లైటింగ్, బోథ్ సుందరీకరణ కోసం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని, దాని ఆధారంగా ఇప్పుడు బోథ్ ఎమ్మెల్యే నేనే తెచ్చాను అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రూ.18 కోట్ల నిధులు కాదు కానీ బోథ్ పట్టణానికి కనీసం తన కోటాలో 18 ఇండ్లు కూడా ఇవ్వలేదని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. రాబోవు ఐదేళ్లలో రైతులందరికీ పొలంబాటలో భాగంగా అన్ని పానాదులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు ప్రజా పాలనకు మద్దతు తెలిపి బోథ్ అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్, షేక్ రజియా బేగం నాజర్ అహ్మద్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, మార్కెట్ డైరెక్టర్ మహమ్మద్ అబ్రర్, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, నాయకులు మెరుగు భోజన్న, వోటర్ కార్ రాజశేఖర్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సుద్దుల అరుణ్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు షేక్ షాకీర్, అబ్దుల్ హసీబ్, కౌసర్, కురుమే గంగారాం, తదితరులు పాల్గొన్నారు.


