- మద్యం సేవిస్తున్నయువకులపై దాడి
- ఇద్దరికి తీవ్ర గాయాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరం ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిబుగ్గలో కాళిక బార్ షాప్‌లో కత్తులతో కొంతమంది స్వైర విహారం చేశారు. ఇద్దరు యువకులపై ఓవర్గం యువకులు కత్తులతో దాడి చేసి గాయపర్చిన ఘటన ఆదివారం రాత్రి కలకలం రేపింది. బార్ షాప్‌లో మద్యం సేవిస్తున్న ఇద్దరిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు సమాచారం. ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఘటనపై వెంటనే స్పందించిన ఏనుమాముల పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం ప్రతిరోజూ పదుల సంఖ్యలో యువకులు ఆయుధాలతో బార్ షాప్ ప్రాంతానికి చేరుకొని భయభ్రాంతులు కలిగిస్తున్నారన్నారు. వారిని అదుపు చేసే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సదరు వర్గం యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి రక్షణ కల్పించాలని ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


