ఈటల వర్సెస్ బండి !
కరీంనగర్ కమల దళంలో వర్గపోరు !
ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల మంటలు
హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూతే కమలంలో రగడ
స్థానిక ఎన్నికల్లో బీఫాం నేనే ఇస్తా అన్న ఈటల
అధిష్ఠానం నిర్ణయమే ఫైనలంటూ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి కౌంటర్
కాషాయ పార్టీలో మళ్లీ ప్రచ్చన్న యుద్ధం
గతంలో బండిపై పరోక్షంగా ఈటల ఘాటు వ్యాఖ్యలు
తాజాగా హుజురాబాద్‌లో ప్రెస్‌మీట్ అనంతరం పెరిగిన వాడీవేఢీ రాజకీయం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు మరోమారు బయటపడింది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ వర్గం.. ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు మరోమారు పొడచూపాయి. హుజురాబాద్ పార్టీ నేతల విషయంపై మొదలైన వివాదం రోజురోజుకూ ముదురుతున్నాయి. తన రాజకీయ ప్రస్థానం మొదలైన నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు అధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఈటల మాటాలు తూటాలు పేలుస్తుంటే .. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటూ అని బండి సంజయ్ వర్గం కౌంటర్లు ఇస్తుండటం కమలదళంలో కలకలం రేపుతోంది. గతంలోనూ ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య పేర్లు ప్రస్తావించకుండా డైలాగ్ వార్‌కు దిగిన సంగతి తెలిసిందే. నీ శక్తి ఏంది.. నీ స్థాయి ఏంది.. నీ చరిత్ర ఏంది.. మా చరిత్ర ఏంది..? అంటూ బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా ఈటల ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
మాటలు.. మంటలు
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినప్పటికీ బీజేపీలో టికెట్ల పొరు కనిపిస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో టికెట్ల కేటాయింపులకు సంబంధించి ఎవరు సుప్రీం లీడర్ అన్న విషయంపైనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈటలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గం పావులు కదుపుతుండగా.. తిరిగి తాను హుజురాబాద్‌కే వస్తా.. ఈ గడ్డే నాకు శాశ్వత అడ్డా అంటూ ఈటల సంకేతాలిస్తూ క్యాడర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఇకపై తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తా.. నమ్మినోళ్లకు.. నమ్ముకున్నోళ్లకు అండగా ఉంటానంటూ ఇటీవల భరోసా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఐదు రోజుల క్రితం హుజురాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఫాం ఇచ్చేది నేనేనంటూ వ్యాఖ్యనించారు. 25 సంవత్సరాల నుంచి నేనే ఇక్కడ లీడర్.. ఇక్కడ పార్టీకి బలం చేకూర్చింది నేనే.. బీఫామ్స్ ఇచ్చేది కూడా మేమే.. అంటూ రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను ఉద్దేశించి పరోక్షంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారంటూ సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
ఈటలకు గంగిరెడ్డి కౌంటర్..!
ఈ విషయంలో ఈటలపై బండి సంజయ్ వర్గం గుర్రుగా ఉంది. ఈటల కామెంట్స్‌ను కోట్ చేస్తూ బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి కృష్ణారెడ్డి ఈటలకు కౌంటర్ ఇచ్చారు. బీఫాంలు ఇచ్చేది వ్యక్తులు కాదు..అధిష్ఠానం..అధిష్ఠానంనిర్ణయమే ఫైనల్.గ్రూపులు, వర్గాలుగా కొనసాగుతున్న అనుచరులకు టికెట్లు, బీఫామ్స్ ఇచ్చే సంప్రదాయం బీజేపీలో లేదంటూ పేర్కొన్నారు.
ముఖ్యమంటూ ఈటల మాటలకు కౌంటర్ ఇవ్వడం కరీంనగర్ కాషాయ పార్టీలో సెగలు రేపింది. ఈ సెగలు ఇప్పట్లో ఆరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యే నాటికి హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాస్త వాడీ వేఢీ రాజకీయమే ఉంటుందన్న విశ్లేషణ జిల్లాలో జరుగుతోంది.
ఈటలకు బలమైన పునాది హుజరాబాద్.
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ పేరు చెబితే హుజురాబాద్ గుర్తుకొస్తుంది. రాజకీయంగా ఆయనకు బలమైన పునాది అందించిన నియోజకవర్గం అదే. రాజకీయ జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా, ఎన్ని మార్పులు జరిగినా ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ ప్రాధాన్యం మాత్రం తక్కువ కాలేదు. ఆయన టీఆర్ఎస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు అయినా, ఆ తర్వాత బీజేపీలో చేరినప్పుడు అయినా హుజురాబాద్ తన రాజకీయ ప్రయాణానికి కేంద్ర బిందువుగానే నిలిచింది. ప్రస్తుతం మల్కాజ్‌గిరీ ఎంపీగా ఉన్న ఆయన.. హుజురాబాద్‌లో తన ప్రాబల్యం యథావిధిగా కొనసాగుతుందనే సంకేతాలు పంపుతున్నారు. ఈక్రమంలోనే.. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, ఇది కేవలం వ్యక్తిగత పదవుల పోటీ కాదు, హుజురాబాద్‌ను ఆధిపత్యంగా చూపించుకునే ప్రయత్నం అని పార్టీలో పలువురు భావిస్తున్నారు.
గతంలో బండిపై ఈటల ఫైర్.. ఇప్పుడు మళ్లీ
గతంలోనూ ఈటల రాజేందర్ బండి సంజయ్‌ను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పేరు ప్రస్తావించకుండానే తీవ్రమైన పదజాలం ఉపయోగించి హెచ్చరించిన సంగతి విదితమే. అయితే ఆ సమయంలో అధిష్ఠానం పెద్దలు..ఈవ్యవహారాన్ని సమసిపోయేలా చూసిందని సమాచారం. అయితే అప్పటి నుంచి ఇరు వర్గాలు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, ఈసారి మళ్లీ మాటల యుద్ధం మొదలవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈటల వర్గం హుజురాబాద్‌లో తన దృష్టిని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తుండగా, బండి వర్గం మాత్రం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేస్తోంది. దీంతో ఈ నియోజకవర్గం చుట్టూ తిరిగే ఈ పరిణామాలు, పార్టీ అంతర్గత శక్తి సమీకరణాలపై ప్రభావం చూపుతున్నాయి. హుజురాబాద్ నుంచి ఉద్భవించిన ఈ పొలిటికల్ పేచీ, ఇప్పుడు బీజేపీకి రాష్ట్ర వ్యాప్త సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.వ


