అంతా వాళ్లే !
అధికారులు, సిబ్బంది ఏజెంట్లుగా జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు
ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దోపిడీ..
ప్రతి దస్త్రానికో రేటు.. ఎవరి వాటా వారిదే…
అన్లైన్ టెస్ట్‌లలోనూ చేతివాటం
డ్రైవింగ్ టెస్ట్ కోసం ప్రైవేట్ వ్యక్తులు
మారని రవాణాశాఖ తీరు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చేతివాటానికి అంతే లేకుండా పోయింది. పనుల నిమిత్తం ఆఫీస్‌కు వచ్చే వాళ్లనుంచి ముక్కుపిండి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికారులు, సిబ్బంది తమ దందాకు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులను ముందు పెడుతున్నట్లు సమాచారం. ఏజెంట్ల మాయాజాలంపైనా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దస్త్రం కదలాలి అంటే జిరాక్స్ ఏజెంట్ ఒక్క ఫోన్ చేస్తే చాలు పని తక్షణమే పూర్తవుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఏ పని కావాలన్నా స్థానికంగా ఉన్న కొన్ని జిరాక్స్ సెంటర్ నిర్వాహకులను కలిస్తే సరిపోతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల, సిబ్బంది తీరుతో కార్యాలయానికి వచ్చేవారు విస్తుపోతున్నారు.
నేను పంపానని చెప్పండి..
విశ్వసనీయ సమాచారం మేరకు.. కరీంనగర్ ఆర్టీఏ శాఖకు రోజు వాహన రిజిస్ట్రేషన్, లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ రీన్యువల్, లైసెన్స్‌లో క్లాస్ ఆఫ్ వెహికల్ చేర్చడం, ఫిట్‌నెస్ టెస్ట్, వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ పరీక్ష, ఆన్‌లైన్ లర్నింగ్ పరీక్ష, రీ-రిజిస్ట్రేషన్ వంటి తదితర పనుల నిమిత్తం పదుల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే ఏ పని కోసం అయినా దస్త్రాలు ఆన్లైన్ ద్వారా ఆప్లైయ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధానం తెలియని వారు ఆర్టీఏ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను నేరుగా సంప్రదిస్తారు. ఈ సమయంలోనే ఇక్కడి సిబ్బంది, అధికారులు తమ జిరాక్స్ ఏజెంట్లను కలిసేలా ముడి పెడుతున్నట్లు విశ్వసనీయం సమాచారం. అక్కడ జిరాక్స్ సెంటర్లో ఒక వ్యక్తి ఉంటారు.. వెళ్లి కలవండి.. మిగతాది అంతా అతనే చూసుకుంటాడు. నేను పంపిచాను అని నా పేరు చెప్పండి. ఇదీగో ఫోన్ నెంబర్ వెళ్లాక నాతో మాట్లాడించు.. అంటూ పంపుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రతి పనికో రేటు..
సాధారణంగా లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో ఆప్లైయ్ చేసుకునే రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది. కానీ శాఖ సిబ్బంది ఏజెంట్ల వద్దకు పంపిచగానే ఈ పద్దతి మారుతుంది. మొత్తం మేమే చూసుకుంటాం.. మేము చెప్పిన తేదీ రోజు వచ్చి సంతకం చేస్తే పని అయిపోతుంది. అందుకు అధనంగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆప్లైయ్ చేసినందుకు సర్వీస్ చార్జ్ రూ.350, ఆన్లైన్ చార్జ్ రూ.550, మిగతావి ఎవరి వాటాలు వాళ్లకు పంపించాలి అని చెపుతుండడం విశేషం. మరీ ఆన్లైన్లో లర్నింగ్ కోసం పరీక్ష ఉంటుంది కదా.. అని ప్రశ్నిస్తే. 20 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. అందులో 12 ప్రశ్నలకు సమాధానం పెడితే చాలు రూ. 100 నుండి 200 ఇస్తే అక్కడ ఉన్న సిబ్బందే మీ పరీక్ష పాస్ చేస్తారు అని సెలవిస్తుండటం మరీ విశేషం. ఇదిలా ఉండగా లర్నింగ్ అనంతరం దస్త్రదారుల ఒరిజినల్ డ్రైవింగ్ రెండోసారి అప్లైయ్ చేసుకోవాలని చెపుతున్నారు. అ దశలోనూ రూ.1500 నుండి రూ.2000 అదనంగా బాదడం కొసమెరుపు.
డ్రైవింగ్ టెస్ట్ దగ్గర ప్రైవైట్ వ్యక్తులు
ద్విచక్ర వాహన, లైట్ మోటార్ వైహికల్, హెవీ మోటార్ వెకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లైయ్ చేసుకున్న వారు ఖచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ (పరీక్ష) లో ఉత్తీర్ణత కావలసి ఉంటుంది. అయితే ఈ పరీక్ష కూడా సదరు శాఖకు చెందిన అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంటుంది. ఈ దశలోను అధికారులు ఏర్పాటు చేసిస ఒక వ్యక్తి తన ప్రతిభ కనబరుస్తున్నట్లు సమాచారం. ఆప్లైయ్ చేసుకున్న వారికి పూర్తిస్థాయిలో డ్రైవింగ్ రాకపోయినా (ప్రైవైట్ వ్యక్తి) దగ్గరుండి వాహన పరీక్షను పాస్ చేపిస్తున్నట్లు సమాచారం.
మారని తీరు.
ఆర్టీఏ శాఖలో నిత్యం వసూళ్ల పర్వం కొనసాగుతున్నాయాన్న బహిరంగ ఆరోపణలు వెలువెత్తుతున్నా రవాణాశాఖ ఉన్నతాధికారుల తీరు మాత్రం మారడంలేదు. లంచాల పర్వంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవలసిన ఉన్నతాధికారులు మౌనం వహించడంలో అంతర్యానికి కారణం ఏంటా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆర్టీఏ కార్యలయంలో జరిగే వసూళ్ల పై అధికారులు మామూలుగా దృష్టి సారిస్తే పూర్తి స్థాయిలో నిజాలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ ఉన్నతాదికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.



