కలెక్టరేట్‌లో మహిళా సిబ్బంది పై అత్యాచారయత్నం
నిందితుడు సస్పెండ్..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అనే ఉద్యోగి తనతో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించినట్టు సమాచారం.
బాధితురాలు తృటిలో నిందితుడి చెర నుంచి తప్పించుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఘటన వెలుగులోకి రావడంతో కలెక్టర్ తక్షణమే ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టరేట్ లోనే ఇలాంటి ఘటన జరగడంపై మహిళా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి పైస్థాయి అధికారుల అండదండలున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కలెక్టరేట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. బాధితురాలికి సహచరులు మద్దతుగా నిలుస్తుండగా, పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.


