- కరీంనగర్ లో స్వయంసేవకుల భారీ కవాతు
- పాల్గొన్న కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన వీధుల్లో స్వయంసేవకులు క్రమశిక్షణతో భారీ కవాతు (పథ సంచలన్) నిర్వహించారు. ఈ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంసేవకుడిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన రూట్ మార్చ్ కరీంనగర్ పలు ప్రధాన రహదారుల మీదుగా రాంనగర్ వరకు కొనసాగింది. అనంతరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచలన్ ముగింపు కార్యక్రమం (సమరోప్) జరిగింది.

సభలో ముఖ్య వక్తగా హాజరైన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి అయచితుల లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే దాన్ని మత లేదా రాజకీయ కోణంలో కాకుండా, నిస్వార్థ సేవా దృక్పథంతో చూడాలని చెప్పారు. సంఘ్ స్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ దేశంలో ఉన్న సామాజిక విభజన వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని భావించి, జాతిని సంఘటితం చేయాలనే లక్ష్యంతో 1925లో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్‌ను ప్రారంభించారని వివరించారు. దేశ సేవా భావన, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఆచరణ, కుటుంబ ప్రబోధన్, పౌర కర్తవ్యాలపై అవగాహన కలిగించే కార్యక్రమాల ద్వారా సమాజాన్ని మారుస్తున్న సంస్థగా ఆర్ఎస్ఎస్ నిరంతరం పని చేస్తోందన్నారు. ఆఎస్ఎస్ ను విమర్శించాలంటే ముందు దానిలో పనిచేయాలన్న సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆరు నెలలు సంఘంలో పని చేస్తేనే దాని అసలు తత్వం అర్థమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధార్థ స్కూల్స్ అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం కోసం పనిచేస్తున్న స్వయంసేవకులు అభినందనీయులని, దేశానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు బూర్ల దక్షిణామూర్తి, నగర సంఘ్ చాలక్ హనుమండ్ల శ్రీనివాస్ రెడ్డి, కార్యవాహ చామ మహేశ్వర్, నగరానికి చెందిన వందలాది మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.


