- బండి సంజయ్‌కు కరీంనగర్ అయ్యప్ప సేవా సమితి వినతి
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : శబరిమల శ్రీ ధర్మశాస్త దేవస్థానంలో బంగారు ఆభరణాల చోరీ, దేవాలయ ఆస్తుల దుర్వినియోగం, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా అయ్యప్ప సేవా సమితి సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు కె. పరమేశ్వర్ గురుస్వామి, పి. సత్యనారాయణ గురుస్వామి, జి. నాగరాజు గురుస్వామి, పి. సాయన్న గురుస్వామి తదితరులు బండి సంజయ్‌ను కలిసి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్ చేపట్టాలని కోరారు. శబరిమల ఆలయంలో 1999లో ఉపయోగించిన 1.5 కిలోల బంగారాన్ని రాగిగా రికార్డు చేయడం, బంగారు కవచాన్ని ప్రైవేట్ సంస్థకు తరలించి కస్టోడియల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం వంటి విషయాలు హైకోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఎస్ఐటీ విచారణలో వెలుగుచూశాయని వారు గుర్తుచేశారు. శబరిమల ఆలయంలో జరిగే అక్రమాలు కేవలం ఆర్థిక అవినీతి కాదు, కోటిమందికి పైగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘోర నేరంగా పరిగణించాలని సమితి తెలిపింది. ఆలయ ఆస్తులపై సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్ జరపాలని, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దేవాలయ ఆస్తుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, ఆస్తుల నిర్వహణను డిజిటల్ పబ్లిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ద్వారా చేపట్టాలని వారు కోరారు. శబరిమల ఆలయానికి కేంద్ర సాంస్కృతిక వారసత్వ రక్షణ హోదా కల్పించాలని కోరారు. భక్తులు ప్రతి ఏటా 41 రోజుల దీక్షతో, ఇరుముడితో శబరిమల యాత్ర చేపడతారని, అలాంటి పవిత్ర స్థలంలో అక్రమాలు జరగడం బాధాకరమని వారు వాపోయారు.


