- మహిళలకు అన్ని సాధ్యమే
- ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి :సాధించాలనే సంకల్పం, సరియైన ప్రణాళిక, శారీరక సుఖాలను త్యాగం చేసే గుణం, ఆచరణలో అమలు పెట్టే తత్వం ఉంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను పొందవచ్చుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మురారి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇష్ట పడి కష్టమైన పని చేస్తే సులువుగా విజయాల్ని సాధిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలు, వివక్షతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
బాలికలు, యువతులు వారివారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. బాల్యవివాహాలను నిరోధించటం, గంజాయి వంటి మహమ్మారులకు వ్యతిరేకంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోపల ఉన్న బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఫోక్సో చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఈ విషయంలో యువతకు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ, తహసీల్దార్ శారద, ఎస్సై రియాజ్ షాష, న్యాయవాదులు కృష్ణారెడ్డి, జంపాల విశ్వ, కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి, గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్ నాయక్, సిబ్బంది శ్రీనివాస్, కమ్యూనిటీ మీడియేటర్స్ అలవాల రామకృష్ణ, మురళి తారక రామారావు, పుట్టల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


