- రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
కాకతీయ, తుంగతుర్తి : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం శనివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతును రాజు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, అందుకు అధికారులు, పాలకులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అంతమేరకు యూరియాను సరఫరా చేయకపోవడంతోనే యూరియా ఇబ్బంది తలెత్తిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పత్తి రైతులు సైతం పంటను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోవాలని సూచించారు. అనంతరం ఆయనను ఫెర్టిలైజర్స్ డీలర్లు ఘనంగా సన్మానించారు.


