- నగర వ్యాప్తంగా రోడ్లు, డ్రైయిన్ పూడికతీత పూర్తి చేయాలి
- ప్రధాన రహదారుల మరమ్మతులు చేపట్టాలి
- కాలినడకన తిరుగుతూ పారిశుధ్య, మట్టి తొలగించే యంత్రాల పనితీరు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరంలో మరింత మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ చేపట్టేందుకు ఈ నెల 13 నుంచి పది రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలో శనివారం ఉదయం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి బైపాస్ రోడ్, సారధినగర్, ఎఫ్.సి.ఐ. గోడౌన్ రోడ్ల నందు కలినడకన జిల్లా కలెక్టర్ పర్యటించారు. రోడ్లకు ఇరువైపులా సైడ్ డ్రైన్ లు, చెత్త, పిచ్చి మొక్కలు, మట్టి పేరుకుపోయిన రోడ్లను ఆయన పరిశీలించారు. నగరంలో చేపట్టే ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రధాన రహదారులు, సెంట్రల్ డివైడర్స్, జంక్షన్ నందు పేరుకపోయిన మట్టిని శుభ్రపరిచే అధునికమైన పవర్ స్వీపింగ్ యంత్రాల పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని నగర వ్యాప్తంగా పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేసి, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త ఉండకుండా శుభ్రం చేయాలని, వర్షాల వల్ల పేరుకుపోయిన మట్టి తొలగించాలని అన్నారు. కార్మికులు, జవాన్ వారీగా రోజుకు డివిజన్ల్ లో ఏ ప్రాంతంలో ఎంతమేర రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలో కార్యాచరణ చేయాలని అన్నారు. మున్సిపల్ శాఖ లోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలన్నారు. పారిశుధ్యనిర్వహణకు అవసరమైన అదనపు కార్మికులు, జేసీబీలు, ట్రాక్టర్, స్వీపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న డ్రైయిన్ల పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
ఏ రోజు తీసిన పూడికతీత అదే రోజు అక్కడి నుంచి తొలగించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పబ్లిక్ పార్క్, బస్ స్టాప్స్, పబ్లిక్ టాయిలెట్స్ పూర్తిగా శుభ్రం చేయాలన్నారు. రోడ్డు మీద నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారిపై ఎక్కడా గుంతలు లేకుండా, అధునిక టెక్నాలజీ జోడించి నిర్ధిష్టమైన మరమ్మతులు చేయాలని, నగరంలో పారిశుధ్య నిర్వహణ యజ్ఞంలాగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ 10 రోజుల పాటు కొనసాగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్, గ్రీనరీ అధికారి రాధిక, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, జవాన్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


