- బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి
కాకతీయ, నల్ల బెల్లి : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి తీవ్రంగా విమర్శించారు. శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 చట్టపరంగా నిలబడదని తెలిసీ కూడా విడుదల చేయడం రాజకీయంగా బీసీలను మోసం చేయడమేనన్నారు. బీసీలకు నిజమైన రిజర్వేషన్లు ఇవ్వాలంటే పార్లమెంటులో చట్టం చేసి, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చేలా కృషి చేయాలన్నారు. కానీ జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ బీసీలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కడంలో చిత్తశుద్ధి చూపలేకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా బీసీల హక్కుల కోసం ఏనాడూ చట్టం చేయలేదన్నారు.
అసెంబ్లీలో అన్ని పార్టీల ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికీ గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం తగదన్నారు. సమస్య తెలిసినా కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా జీవో నెంబర్ 9 జారీ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రాజకీయ డ్రామాలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా పోరాడాలని ఆయన పేర్కొన్నారు. అఖిల పక్షపోరాటాలకు బీఆర్‌ఎస్ పార్టీ కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చెట్టు పెళ్లి మురళీధర్, మాజీ ఎంపీటీసీలు సూరయ్య, దేవ్, మండల ప్రధాన కార్యదర్శి కోటిలింగాచారి, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచులు రాంబాబు, తిరుపతి, అమరేందర్, గూబ రాజు, గుగులోతు రాము, గోల్య, నాగెల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


