- అవసరం లేని పురుగుమందులను అంటగడుతున్న వైనం
- మోతాదు పెంచి అమ్ముతూ లాభాలు గడిస్తున్న వ్యాపారులు
- పంట నష్టంతో బెంబేలెత్తుతున్న రైతులు
- న్యాయం చేయాలంటూ వేడుకోలు

కాకతీయ, నర్సింహులపేట : ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగడుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో సతమతమైన రైతులకు ఒకవైపు యూరియా సంక్షోభం తలెత్తింది. వేకువ జామున లేచింది మొదలు రాత్రి వరకు యూరియా కోసం జాగారం చేయడం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ప్రతీ సమస్యను ఎలాగోలా నెట్టుకొస్తున్న అన్నదాతకు క్రిమి సంహారక రసాయానుల విక్రయదారుల నుంచి కొత్తరకం సమస్య వస్తోంది. తమ పంట చేతికందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నతరుణంలో ఫెస్టిసైడ్ వ్యాపారులు అంటగడుతున్న మందులతో పంట మొత్తం నష్టపోయే పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు పోనూ ఈ ఏడాది అయినా పంట కలిసి వస్తుందేమోనని ఎదురుచూస్తున్నఅన్నదాతలకు నిరాశే మిగులుతోంది. అన్నదాతకు అవసరంలేని పురుగు మందులను అంటగడుతూ దుకాణా దారులు రైతులను నట్టేట ముంచుతున్నారు.

తాజాగా ఈ కోవలోనే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని మన గ్రోమోర్ సెంటర్ నిర్వాహకుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. సదరు సెంటర్ నిర్వాహకులు అమాయక ప్రజలే టార్గెట్ చేసుకుని మూడు పూవులు ఆరు కాయలుగా వ్యాపారం సాగిస్తున్నారు. పంటకు అవసరంలేని మందులను అంటగట్టడంలో వీరు సిద్ధహస్తులని పలువురు రైతన్నలు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన మోతాదును మించి డోస్ పెంచి అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. నర్సింహులపేట మండలంలోని బోజ్జన్నపేట గ్రామానికి చెందిన జాగాటి రామ్మూర్తి తనకున్న రెండు ఎకరాల భూమిలో వరి పంట సాగు చేశాడు. వరి పంటకు రోగం తగలడంతో మన గ్రోమోర్ సెంటర్ కు వెళ్లాడు. వరిలో పురుగు చనిపోవుట గాను 20 పంపులకు ప్రోపనోపాస్, ట్రైసైక్లో జోల్ కాంబినేషన్లో మందులను రైతుకు సెంటర్ వారు ఇచ్చారు. ఈనెల ఏడో తేదీన రైతు 20 పంపులు పిచికారి చేశానని తెలిపారు.
ఈ క్రమంలో పొలానికి వెళ్లి చూడగా పొలం మొత్తం ఎరుపు రంగులోనికి మారడంతో సదరు రైతు బిక్క మొహంతో ఆందోళన చెందినట్లు తెలిపారు. చుట్టుపక్క రైతులను సంప్రదించగా పురుగుమందు డోసు పెరగడంతో పొలం ఎండిపోయినట్లుగా నిర్ధారించారు. తనకు అధిక మోతాదు పురుగుమందును అంటగట్టిన వ్యాపారులపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా బాధిత రైతు కోరుతున్నాడు. ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ ను వివరణ కోరగా ప్రోపోనోపాస్ 50 ఈసీ పురుగుమందును 2 ఎంఎల్ మందును ఒక లీటర్ నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. 20 పంపులకు గాను 400 ఎంఎల్ మందును మాత్రమే పిచికారి చేయాలని, ఎక్కువ డోసు పిచికారి చేయడం ద్వారానే పొలం ఎర్రబారి పోయినట్లు తెలిపారు. మోతాదు మించి ఎక్కువ ఎక్కువ డోస్ తో విక్రయాలు జరిపినటువంటి మన గ్రోమోర్ సెంటర్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఏవో స్పష్టం చేశారు.


