- దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులది ముఖ్య పాత్ర
- ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలి
- పదేళ్లలో వ్యవసాయ రంగానికి రూ. 13 లక్షల కోట్లకుపైగా సబ్సిడీలు ..
- పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
కాకతీయ, నేషనల్ డెస్క్ : భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి, గోధుమ పంటలతోపాటు ప్రొటీన్ అధికంగా లభించే పప్పుల సాగును మరింత పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆయన పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన దేశంలో పండించాలని పిలుపునిచ్చారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి రూ. 5 లక్షల కోట్ల సబ్సిడీలు ఇస్తే, తమ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ. 13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని ఆయన తెలిపారు.
నిరంతరం కొత్త మార్పులు రావాలి
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అన్ని రంగాల్లో నిరంతరం కొత్త మార్పులు చోటుచేసుకోవాలని మోదీ అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి వదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోందని తెలిపారు. వీటన్నింటినీ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన కిందకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో గత పాలకులు రోడ్లు వేయించలేదని, అలాంటి ప్రాంతాలను తమ ప్రభుత్వం డిజిటల్ ఇండియా దిశగా నడిపిస్తోందని అన్నారు. గత పదకొండేళ్లలో రైతులు పలు విజయాలు సాధించారని, పదివేలకు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయని తెలిపారు.
రైతుల కోసం రెండు కొత్త పథకాలు..
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం రూ.35,000 కోట్లకు పైగా అవుట్‌లేతో రెండు ప్రధాన కొత్త పథకాలను ప్రారంభించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన (అవుట్‌లే: రూ.24,000 కోట్లు) కింద 100 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యం, పంటకోత అనంతర నిల్వను బలోపేతం చేయడం , రుణ లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించబడింది. మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (అవుట్‌లే: రూ.11,440 కోట్లు) కింద పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి, సాగు విస్తీర్ణాన్ని విస్తరించి, విలువ గొలుసును (కొనుగోలు, నిల్వ, ప్రాసెసింగ్) బలోపేతం చేయడం ద్వారా పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించడం ఈ మిషన్ లక్ష్యం. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ పప్పు ధాన్యాల సాగు చేస్తున్న రైతులతో కూడా ముచ్చటించారు.


