- న్యాయపోరాటానికి సర్కార్ సిద్ధం కావాలి
- బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి కేంద్రంపైనా ఒత్తిడి పెంచాలి
- అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో ..
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి ఆరు నెలలు గడిచిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోలేదు.. ఈ బిల్లులకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు.
పిటిషన్ దాఖలు చేయాలి
2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇకనైనా సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.


