- బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్తాం..
- రిజర్వేషన్లు అమలుచేశాకే ఎన్నికలకు పోతం..
- బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం ఆపాలి
- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బనకచర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్లు, బీజేపీ– బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. జగన్‌తో కేసీఆర్ చెట్టాపట్టాల్ వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని, ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని మండిపడ్డారు. బనక చర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ అంశంపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో వివరించే ప్రయత్నం చేశారని చెప్పారు.
నోటికాడ ముద్దను లాగుతున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ఖచ్చితంగా అమలు చేస్తామని మహేష్‌కుమార్ అన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీ అని ఆరోపించారు. కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని, పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు మొఖం చాటేశారని ప్రశ్నించారు.
జిల్లాకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్ విషయమై సీఎం చర్చించామన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని అన్నారు. కామారెడ్డిలో బీసీ సభ తప్పకుండా ఉంటుందని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని స్పష్టంచేశారు.


