- ఆరు గ్యారంటీలను అమలులో వైఫల్యం
- దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారు
- పథకాలు అమలులో చేతకాక చతికిల
- బీసీ రిజర్వేషన్లపై గందరగోళం సృష్టించింది
- హుజురాబాద్ గడ్డ నాకు కొత్త కాదు
- ఇక్కడ బీఫాంలు ఇచ్చేది నేనే
- మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల స్పష్టీకరణ
కాకతీయ, హుజురాబాద్ : ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు ఫెయిలైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నిల ముందు అడ్డగోలుగా హామీలిచ్చిందన్నారు. ఆర్థిక పరిస్థితులను అంచనా వేయకుండానే హామీలను గుమ్మరించి ప్రజలను మోసం చేస్తూ అధికారం దక్కించుకుందన్నారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు హామీలను అమలు చేయలేక చతికిల పడిందన్నారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఈ అంశంపై తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ చిత్తశుద్ధి లేకపోవడం లేకపోవడం వల్లనే అబాసుపాలైందని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, అనాలోచితంగా మూర్ఖంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఈ రిజర్వేషన్ల అంశం రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఈ రాజ్యాంగ సవరణ అంశం, కేంద్రానికి సంబంధించిందని రాజ్యాంగబద్ధమా కాదా చూడాలని స్పష్టం చేశారు.
ఉద్యోగులకు ఇబ్బందులు
జీతాలివ్వకుండా.. పెన్షన్లు ఇవ్వకుండా అరిగోస పెడుతున్నాడనే కేసీఆర్‌ను వద్దనుకుని చతికిలపడి ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ అధికారంలోకి తీసుకొచ్చినందుకు రేవంత్ సర్కారు కూడా ఇబ్బందులు పెడుతోందన్నారు. ఇప్పుడు అప్పులున్నాయని చెబుతూ.. మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్‌కు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ఎందుకు అడ్డగోలుగా హామీలిచ్చిదంటూ ప్రశ్నించారు. అనేక రకాలైన హామీలతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. ప్రజలను మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీల హామీల అమలు గురించి మంత్రులకు మాట్లాడే ధైర్యం లేదని అన్నారు.
బీసీలకు బీజేపీ అండ..!
బీసీలకు బీజేపీ అండగా ఉంటుందని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాది నిర్మాణమైందన్నారు. హైదరాబాదులో పేదల గుడిసెలు కూలగొట్టింది ప్రజల బతుకులు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఎప్పటికైనా ప్రజలకు తోడుగా అండగా ఉండేది బీజేపీయేనని అన్నారు. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని, కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నా.. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రజల కోసం పాటుపడ్డానని గుర్తు చేశారు.
హుజురాబాద్ నాకుకొత్త కాదు.. బీ ఫాంలు ఇచ్చేది నేనే
హుజురాబాద్‌కు తానోదో కొత్తనాయకుడి అన్నట్లుగా.. తనకు ఇకహుజురాబాద్‌తో ఏం సంబంధం లేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఈటల అన్నారు. హుజురాబాద్ గడ్డ మీద నుంచే తన రాజకీయం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఇక్కడ పార్టీ బీ ఫాంలు ఇచ్చేది మాత్రం తానేనని అన్నారు. నాయకులెవరు.. కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


