- 42% రిజర్వేషన్ సాధనకు బీసీలు ఏకం కావాలి
- కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
కాకతీయ, హనుమకొండ : బీసీలు రాజ్యాధికార స్థానంలోకి వస్తారనే భయం అగ్రవర్ణాలకు పట్టుకుందని కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో బీసీల 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్న అగ్రవర్ణ శక్తులపై బీసీలు ఇక మౌనంగా ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డా, ప్రజా శక్తితో రాష్ట్రాన్ని సాధించామన్నారు. అదే తీరులో బీసీలు ఐక్యమై 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తారని సుందర్ రాజ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక అగ్రవర్ణాల పాలన వద్దు బీసీల పాలన కావాలి అని గర్జించారు. బీసీల నోటికాడి బుక్కను గద్దెలలాగా ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన ఆయన, అగ్రవర్ణాలు మమ్మల్ని అడ్డుకుంటే, వారిని అడ్డుకోవడానికి బీసీలకు ఎక్కువ సమయం పట్టదన్నారు. తమిళనాడులో సాధ్యమైన రిజర్వేషన్లు తెలంగాణలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ నేతలు పరస్పరం నిందించుకోవడం ద్వారా తామే బీసీ వ్యతిరేకవాదులుగా మారిపోతున్నారని వ్యాఖ్యానించారు. బీసీల పక్షాన ఉండే పార్టీలు మాత్రమే తెలంగాణలో నిలబడతాయని, బీసీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు భూస్థాపితం అవుతాయని హెచ్చరించారు. వరంగల్ ఉద్యమ గడ్డ నుంచే బీసీ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.


