జీవో నెంబర్ 9 దహనం..
బీసీల 42% రిజర్వేషన్ సాధనకు బీసీ సంఘాల సంకల్పం..
రేవంత్ రాజీనామా చేయాలి..
కాళోజి జంక్షన్ వద్ద బీసీ సంఘాల ఆగ్రహం..
హైకోర్టు స్టే తర్వాత బీసీల ఉద్యమానికి శ్రీకారం..
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం : టి ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్ డిమాండ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు కాళోజి జంక్షన్ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టాయి. జీవో నెంబర్ 9 ప్రతులను దహనం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా బీసీల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడం వల్ల బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు దూరమవుతున్నాయి. ఈ జీవో బీసీల హక్కులను కించపరిచేలా ఉందని, బలహీనమైన విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ మేధావులు, సంఘాలు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి, 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం తీవ్ర ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు.
బీసీలను అనగదొక్కే కుట్రలను రాజ్యాధికార పార్టీ బట్ట బయలు చేస్తుంది. రిజర్వేషన్ల సాధన వరకు పోరాటం కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం, బీసీల రిజర్వేషన్లు సంక్షోభంలో పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. టి ఆర్ పి వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న పిలుపుతో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా నాయకులు పెండల సంపత్ పటేల్, జంగిలి శ్రీనివాస్, పోలు రాజు, పల్లకొండ చందు, మాదం నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



